| రైల్వేలో సెలవు.. ప్రైవేట్‌గా కొలువు! 23/12/2012 by sushil on 23 December, 2012 - 12:00 PM | ||
|---|---|---|
sushil | రైల్వేలో సెలవు.. ప్రైవేట్‌గా కొలువు! 23/12/2012 on 23 December, 2012 - 12:00 PM | |
గుత్తి, డిసెంబర్ 22: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లో అత్యంత కీలకమైన డీజల్ లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గూడ్స్ గార్డులు దీర్ఘకాలిక సెలవులు పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవడాన్ని రైల్వే యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. వీరిపై కొరడా ఝళిపించడానికి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిథుల అండ ఉందనే ధీమాతో పలువురు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులో కొనసాగుతున్నారు. వీరి వివరాలు సేకరించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేసినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలోని ఒక్క గుంతకల్లు డివిజన్‌లోనే బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వందలాది మంది స్థానికేతరులు లోకో పైలట్లు, అసిస్టెంట్ పైలట్లు, గూడ్స్ గార్డులుగా పని చేస్తున్నారు. గతంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రతినిథులు రైల్వేశాఖ మంత్రులుగా పనిచేయడంతో వారి సహకారంతో గుంతకల్లు డివిజన్‌లోనే కాక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వేలాది మంది ఉద్యోగాలు సంపాదించారు. ఇందులో ఎక్కువ శాతం లోకో పైలట్లు, సహ పైలట్లు, గూడ్స్ గార్డులు, స్టేషన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. వీరంతా విధుల్లో చేరినప్పటి నుండి తమకు ఉద్యోగాలు ఇప్పించిన మంత్రుల పేర్లు చెప్పుకుని హవా సాగించడం, తరచూ విధులకు డుమ్మా కొట్టడం ఆనవాయితీగా మారింది. మంత్రుల అండదండలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకోవడానికి స్థానిక రైల్వేశాఖ అధికారులు వెనకడగు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ముందు తాత్కాలిక సెలవులపై వెళ్తుంటారు. తరువాత ఆరోగ్యం సక్రమంగా లేదని, సెలవు పొడిగించాలని కోరుతూ ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపుతున్నారు. దీనికి డాక్టర్ సర్ట్ఫికెట్లు జత పరుస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వేలోనే పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు సమకూర్చే రవాణా విభాగంలో పనిచేసే ఉద్యోగులు కీలక సమయంలో దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడం, విధులకు డుమ్మా కొడుతుండటంతో ప్రత్యామ్నాయంగా సిబ్బందిని సమకూర్చుకోవడానికి సంబంధిత క్రూ కంట్రోలర్లు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ ప్రభావం డివిజన్ మొత్తం మీద పడుతోంది. గత నెలలో గుత్తి ప్రాంతంలో పర్యటించిన గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ తేజేందర్‌పాల్ సింగ్ గుత్తి లాబీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనేక మంది డీజల్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన విచారించగా కఠోరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. డివిజన్లో పని చేస్తున్న వందలాది మంది బీహార్, మహారాష్టక్రు చెందిన వారు ఇక్కడి నుండి దీర్ఘకాలిక సెలవుపై అక్కడ మరో ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారుల విచారణలో వెల్లడయినట్లు తెలుస్తోంది. దీంతో రైల్వేశాఖ యాజమాన్యం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన వారి వివరాల సేకరిస్తోంది. నిబంధనలను అతిక్రమించి సెలవుపై వెళ్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఖాళీగా ఉన్న లోకో పైలట్లు, అసిస్టెంట్ పైలట్లు స్థానంలో కొత్తవారిని నియమించుకోవడానికి వీలుగా ముందుగానే స్థానికేతర రైల్వే ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. | ||